– టీవీ, స్మార్ట్ ఫోన్ లేక ఆన్‌లైన్ చదువుకు దూరమవుతున్నారా..?
– ఇకపై చింతించాల్సిన పనిలేదు..!
– పేద విద్యార్థులు చదువుకునేందుకు సహాయం చేస్తున్న సంకల్ప ఫౌండేషన్
– దాతలు ముందుకు వస్తే జిల్లా వ్యాప్తంగా సేవలందిస్తామంటున్న ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజీ
– రోజీ సేవలను అభినందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా విజృంభన నేపథ్యంలో చాలాకాలంగా చదువుకు దూరమైన చిన్నారులు ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్ క్లాసులకు అలవాటు పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇంకా చాలమంది చిన్నారులు పాఠాలు వినలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సర్కారు దూరదర్శన్, టీశాట్ లాంటి చానళ్లలో విద్యాబోధన మొదలు పెట్టింది. ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు తమ స్థాయికి తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లలో విద్యను అభ్యసిస్తుండగా చాలా మంది నిరుపేద విద్యార్థులు ఇళ్లలో టీవీలు, డిష్ సౌకర్యాలు లేక పాఠాలకు దురమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పేద విద్యార్థుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ బాధ్యత నెత్తిన వేసుకుంది సంకల్ప ఫౌండేషన్.
జిల్లా కలెక్టర్ అభినందనలు…
చందానగర్ పరిధిలోని సంకల్ప ఫౌండేషన్ ప్రతినిధులు ఇంటింటి సర్వే నిర్వహించి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్న విద్యార్థుల జాబితాను సిద్ధంచేశారు. అసలు టీవీ లేని వారు, టీవీ ఉండి డిష్, కేబుల్ కనెక్షన్ లేనివారు, ఆన్‌లైన్ పాఠాల గురించే తెలియని వారిని గుర్తించి వారికి పాఠాలు వినే అవకాశం కల్పించారు. మొదటి రోజు శాంతినగర్, పాపిరెడ్డి కాలనీల్లోని విద్యార్థులు సంకల్ప ఫౌండేషన్ ఆశ్రమంలో ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యారు. 6, 7, 8, 10వ తరగతులకు చెందిన మొత్తం 46 మంది బుధవారం పాఠాలు విన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తరగతులకు హాజరైన వారికి మాస్కులతో పాటు శానిటైజర్‌ను అందజేశారు. భౌతిక దూరం పాటిస్తూ టీవీలో వచ్చే పాఠాలు చూస్తూ చదువుకునే ఏర్పాటు చేశారు. గత పదిహేను రోజులుగా పాఠాలకు దూరమైన చిన్నారులు ఎట్టకేలకు ఆన్‌లైన్ తరగతులను వీక్షించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఫౌండేషన్ నిర్వాహకురాలు గుండ్ర రోజీని అభినందించారు.
జిల్లా వ్యాప్తంగా సేవలందించేందుకు సిద్ధం…
ఆన్‌లైన్ తరగతులకు నోచుకోక నిరుపేద విద్యార్థులు చదువులకు దూరం కావద్దని మావంతు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్థుతం శేరిలింగంపల్లిలోని పేద విద్యార్థులు పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టీవీ ద్వారా పాఠాలు వినే అవకాశం కల్పించాం. దాతలు ముందుకు వచ్చి టీవీలు, డిష్ ఇతర వ్యవస్థల నిర్వహణకు సహకారం అందిస్తే జిల్లా వ్యాప్తంగా నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. మా ప్రయత్నంలో భాగస్వాములు కావాలనుకునే, టీవీ, స్మార్ట్ ఫోన్ లేక చదువుకు దూరమవుతున్న విద్యార్థులు మా ఫోన్ నంబర్ 9391358214లో సంప్రందించవచ్చు.
-గుండ్ర రోజీ,
సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు,
రాష్ట్ర జువైనల్ అడ్వయిజరీ బోర్డు సభ్యురాలు.