- రహదారి మరమ్మతులు చేయాలని యువకుల వినూత్న నిరసన

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల రహదారిలో మూన్ వాక్ ఏమిటి…? ఏదైనా కొత్తగా అమ్యూస్ మెంట్ పార్క్ ప్రారంభించారా అని ఆలోచిస్తున్నారా..? ఖనిజ నిక్షేపాల కోసం కొత్తగా ల్యాండ్ మైనింగ్ ఏమైనా చేస్తున్నారా..? అనే సందేహాలు మీలో కలగొచ్చు. ఇదేమీ కాదండోయ్ ఈ ప్రాంతానికి చెందిన సాయితేజ, శ్రీకాంత్, శ్రీనివాస్, వినయ్ అనే నలుగురు యువకులు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చమంటూ వినూత్న రీతిలో చేపడుతున్న నిరసనల తీరిది. నల్లగండ్ల నుండి తెల్లాపూర్ వెళ్లే రహదారిపై పెద్ద పెద్దగుంతలు ఏర్పడి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆర్ అండ్ బి రేడియల్ రోడ్ల విభాగం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇలా నిరసన తెలుపుతున్నారు. గత 10 నెలలుగా రహదారి విస్తరణ పనులు ముందుకు సాగకపోవడంతో కనీసం రహదారిపై గుంతలనైనా పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని, ఆర్ అండ్ బి అధికారులకు ఫిర్యాదులు (నెం No.GRI/05102020/0707, GRI/06102020/0708, GRI/07102020/0711 ) చేసినా ఫలితం లేదంటూ వీరు ఆవేదన చెందుతున్నారు. ఐటి హబ్ తో అనుసంధానమై ఉన్న ఈ రోడ్డు పై నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారని ఇప్పుడైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మత్తులుచేపట్టాలని కోరుతున్నారు.
