శేరిలింగంపల్లిలో అభివృద్ధి ఎక్కడ: మాధవరెడ్డి

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చ‌డంతోపాటు సింబల్ ను రిజర్వ్ చేసిన‌ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మాధవరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో సమస్యలు, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయ‌న్న‌ట్లుగా త‌యార‌య్యాయ‌ని తెలిపారు. అధికారులను కలిసి ఫిర్యాదు చేసిన కూడా చర్యలు చేపట్టడం లేద‌ని, ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేసినా కూడా పనులు మొదలు పెట్టడం లేద‌న్నారు. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ధ్వ‌జ‌మెత్తారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోతుంటే కార్పొరేట్ , ప్రైవేట్ విద్యాసంస్థల ధన దాహానికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నార‌న్నారు.

చందానగర్ సర్కిల్ లో 100 కోట్ల‌ పన్నులు వసూలు అయినా కూడా అభివృద్ధి పనులను అధికారులు పట్టించుకోవడం లేద‌న్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను పట్టించుకోవడం లేద‌ని, రోడ్లను తవ్వి కాంట్రాక్టర్లు మరమ్మత్తులు చేయడం లేద‌న్నారు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా కనిపిస్తున్నాయ‌న్నారు. అడుగుకో గుంత ఏర్పడడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. వర్షాలు పడ్డప్పుడు రోడ్లపై గుంతలు ఏర్పడడం సహజం. ఇప్పుడు వర్షాలు లేకున్నా అదే పరిస్థితి ఉంది. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అభివృద్ధి పనులు చేయవలసిన అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రారంభించిన పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ప్రభుత్వం మారినా.. అధికారులు మారినా.. అక్రమ కట్టడాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల తీరు సైతం మారడం లేదు. అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పుమంటున్నా.. GHMC అధికారులు ఎందుకో లైట్ తీసుకుంటున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ.. ఇల్లీగల్ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు.. మనం చేసే పని చేసుకుందాం’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విచ్చలవిడిగా బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి‌కొడుతూ వందల సంఖ్యలో నూతన భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఉన్న స్థలానికి, కడుతున్న నిర్మాణాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. స్థలం తక్కువైనా సెల్లార్లు తవ్వి 7, 8 అంతస్థుల నిర్మాణానికి ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. ఎవరికేం పోయేది లేకున్నా జీహెచ్ఎంసీ మాత్రం భారీగా తన ఆదాయాన్ని కోల్పోతోందని అన్నారు.

ప్రజా సమస్యల పైన ప్రజల తరఫున ప్రశ్నించడానికి శేరిలింగంపల్లి జనసేన పార్టీ “నమస్తే శేరిలింగంపల్లి” అనే నిదానంతో ప్రజల్లోకి వెళ్తున్నామ‌ని అన్నారు. ప్రజా సమస్యలను తీర్చడమే ప్ర‌ధాన ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ Dr. మాధవరెడ్డి, చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వులిసి శ్రీనివాసరావు , హఫీజ్‌పేట్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ కుమార్ , మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ హరి నాయక్, పార్టీ నాయకులు విష్ణువర్ధన్ నాయుడు , శివ , పంతం రంగా శ్రీనివాస్, గుంటూరు శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here