శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శిల్పారామం మాదాపూర్‌లో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజారెడ్డి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయ నృత్యరీతులు, అభినయం, లయబద్ధమైన నృత్య విన్యాసాలతో కళాకారులు ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా గణేశ నృత్యం, సదాశివునకు వందనం, జతిస్వరం, నటేశ కౌతం, శివుడు తాండవమాడెను, శివ చరితం, భావములోన, నాగ స్తుతి, తాండవం, శివాష్టకం తదితర అంశాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.

ఈ నృత్య ప్రదర్శనలో గరిమ, సాయి శ్రీనిత, శాన్వి శ్రీ, రితిక, భూమి, అనన్య, మాన్య, తేజస్విని, మిధున, రిత్విక, నియతి, హిమశ్రీ, నాయన, వేదంశి, అక్షర తదితరులు పాల్గొని తమ నృత్య ప్రతిభతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయమైన కూచిపూడి కళకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు యువ కళాకారుల్లో కళాత్మక ప్రతిభను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం సాగింది.





