నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక దీక్షకు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మద్దతుగా నల్ల బ్యాడ్జి లను నోటికి కట్టుకుని మౌన దీక్షలో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి వీఆర్ఏలు అతి తక్కువ జీతానికి పనులు చేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖను సీఎం కేసీఆర్ దగ్గర పెట్టుకుని రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ లో అవకతవకలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రెవెన్యూ శాఖను , రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల సమస్యలపై సీఎం కేసీఆర్ హామీనిచ్చి విస్మరించారని పేర్కొన్నారు. వీఆర్ఏలను పే స్కేల్ ఎంప్లాయీస్ గా తీసుకోవాలని, డిగ్రీ పూర్తి చేసిన వీఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలని, 55 ఏళ్ల పై బడిన వీఆర్ఏ ల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాగుల్ గౌడ్ , నవతా రెడ్డి, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, ఆంజనేయులు సాగర్, ఆకుల లక్ష్మణ్, శంకర్, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, రవి గౌడ్, అశోక్, రామకృష్ణ, వినయ్, ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.