నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం నాటికి 23 వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ వీఆర్ఏలకు ఫే స్కేల్ జీఓ, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఇవ్వడం లేదన్నారు. 55సంవత్సరాలు పై బడిన వీఆర్ఏలకు వారి కుటుంబంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. రోజురోజుకు నిత్యావసర ధరలు పెరుగుతున్నా వీఆర్ఏలకు నామమాత్రంగా వేతనాలు చెల్లించడంతో చాలీచాలనీ జీతాలతో బతుకులు వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్షలో వీఆర్ఏలు లక్ష్మయ్య, రాజు, రామకృష్ణ, మన్నె సురేష్ ముదిరాజ్, శ్రీకాంత్, రాందాస్, గోపాల్, టి. కృష్ణ, జమీర్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.