నమస్తే శేరిలింగంపల్లి: వేదం చదువుకొనే పేద బ్రాహ్మణ వేద విద్యార్థులకు కావలసిన నిత్యావసర వస్తువులను వేదపాఠశాలలకు అందించడంతో పాటు వేదాలు చదివిన వేదోత్తములు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక సహకారం అందించడమే వేద రక్షణం సమితి ముఖ్య ఉద్దేశ్యమని వేద రక్షణం సమితి అధ్యక్షుడు రాధాకృష్ఞమూర్తి అన్నారు. యజుర్వేదం, సామవేదంలో ఘణాపాటి అయిన బ్రహ్మశ్రీ జోసుల జోగేశ్వర శర్మ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న వేద రక్షణం సమితి అండగా నిలిచింది. చందానగర్ కార్యాలయంలో సమితి కార్యవర్గ సభ్యులు జోగేశ్వర శర్మ దంపతులను శాలువా, పూలమాలతో సత్కరించి రూ. 20,116 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వేద రక్షణం సమితి అధ్యక్షుడు రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ వేదం అంటే శివం, శివం అంటే వేదం, వేదం నుండే సర్వ జగత్ నిర్మితమైందని మనం ఎన్నోసార్లు ఎందరో మహానుభావుల ప్రసంగాలలో విన్నామన్నారు. అలాంటి వేదాభివృద్ధి కోసం చందానగర్ లో వేద రక్షణం సమితి స్థాపించడం జరిగిందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వేద పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కెవి సుబ్బారావు, జనరల్ సెక్రటరీ బీఎస్ఎల్ జ్యోత్స్న, జాయింట్ సెక్రటరీ జీఎస్ శ్రీనివాస్, ట్రెజరర్ పూర్ణిమ, చీఫ్ అడ్వయిజర్ వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మస్తాన్ రావు, ధర్మారావు, శ్రీవల్లి, టీవి గుప్తా తదితరులు ఉన్నారు.