నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్‌లోని జిల్లా దవాఖానలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ దొంగతనంపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాలని, సమగ్ర విచారణ జరిపి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా
ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కంటితుడుపు చర్యగా ఉన్నాయని ప్రజలకు బ్రతుకుపై భరోసా కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాని అన్నారు. ఒకవైపు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా ఉదృతిని తమకు అనుకూలంగా మలుచుకని రోగుల నుంచి అందిన కాడి దోచుకుంటుండగా ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందించించాల్సింది పోయి సిబ్బంది దొంగతనాలకు పాల్పడుతుండటం సిగ్గుచేటని అన్నారు. ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ దొరకక సతమతమవుతుంటే కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో 500 కోవిడ్ వ్యాక్సిన్ ఇంజక్షన్లు చోరికి గురవ్వడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వ్యాక్సిన్ చోరిపై సమగ్ర విచారణ జరపాలని, భాద్యులైన సిబ్బందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
