నమస్తే శేరిలింగంపల్లి: దీప్తీశ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో శివకేశవుల వార్షిక కల్యాణ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా భక్తుల కోలాహలం నడుమ కన్నుల పండువగా జరిగే శివకేశవుల కల్యాణం కోవిడ్ ఉదృతి, లాక్‌డౌన్‌ల కారణంగా నిరాడంబరంగా ముగిసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేదపురోహితులు ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, ధీక్షాధారణ, 108 కలశాలతో ధ్రువ మూర్తులకు, కల్యాణ మూర్తులకు అభిషేకాలు, నీరాజన మంత్ర పుష్పాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్ర హోమం, పూర్ణాహుతిలతో పాటు ఒకే వేదికపై శ్రీ బ్రామరి దుర్గాంభికా దేవి సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లకు కల్యాణాలు జరిపించారు. కాగా భక్తులు నేరుగా రాలేని పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా కల్యాణాన్ని తిలకించి దేవతాశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా క్షేత్రం వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి మాట్లాడుతూ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు లేకుండా పురోహితులతోనే ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, ఆ శివకేశవుల కరుణ కటాక్షాలతో కోవిడ్ మహమ్మారి నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుందని ఆకాంక్షించారు.