నమస్తే శేరిలింగంపల్లి: మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లోని ఉమాస్ సపైర్ హైట్స్ అపార్ట్మెంట్ లో మంజీరా మంచినీటి సరఫరాను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కళల ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీటి నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఉచిత మంచినీటి పథకం ద్వారా 20 వేల లీటర్ల నీటిని అందజేస్తున్నామని అన్నారు. పాత పైప్ లైన్ లో కలుషిత నీరు కలవటం వలన కాలనీ వాసుల కోరిక మేరకు పాత పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ వేశామని, ఎన్నో ఏళ్ల కలుషిత నీటి సమస్య నుండి విముక్తి లభించిందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్లా కనెక్షన్ తో నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ యాదయ్య, ఎస్ ఐ లు అహ్మద్ పాషా, రంజిత్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, మంత్రి ప్రగాఢ సత్యనారాయణ,రామేశ్వరమ్మ, రామారావు, లక్ష్మణ్ రావు, మహేందర్, లక్ష్మణ్, అనిల్, శ్రీమయి తదితరులు పాల్గొన్నారు.
