- భారతీనగర్ డివిజన్లో భారీ బైక్ ర్యాలీ
భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్‌లో ముమ్మాటికీ తెరాస జెండా ఎగురుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. భారతీ నగర్ డివిజన్లో తెరాస కార్పొరేటర్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ పాల్గొన్నారు. ఎంఐజీలోని పోచమ్మ ఆలయం వద్ద ఉన్న మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై ఎంఐజీ, ఎల్ఐజీ, విద్యుత్ నగర్, ఆర్సీ పురం, ఓల్డ్ బాంబే కాలనీల మీదుగా కొనసాగింది. అనంతరం పటాన్‌చెరులోని జీఎంఎర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదని, అభివృద్ధి అంతా కేవలం తెరాస హయాంలోనే జరిగిందన్నారు. గ్రేటర్లో ఎవరి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నామన్నారు. కచ్చితంగా మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. గ్రేటర్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. తెరాసతోనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అంతకు ముందు మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ విప్ గాంధీలు పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు.