శేరిలింగంపల్లి, అక్టోబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): అయ్యప్ప స్వామి యాత్రలో ఉన్న కష్టాలు భక్తికి పరీక్షల లాంటివని, కఠినమైన మార్గంలో నడుస్తూ స్వామియే శరణం అయ్యప్ప అని జపించడం ద్వారా మనసు దృఢంగా, విశ్వాసం గాఢంగా మారుతుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అక్టోబర్ 17వ తేదీన శ్రీశ్రీశ్రీ మానవళన్ గురు స్వామి, శ్రీశ్రీశ్రీ వేణుగోపాల్ గురు స్వామి ఆశీస్సులతో బిహెచ్ఈఎల్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శ్రీ శబరిమల ఆలయం వరకు ఎన్ లింగ రెడ్డి గురు స్వామి, ఎస్ఎన్ రెడ్డి గురు స్వామి, రాగం శ్రీనివాస్ యాదవ్ గురు స్వామి, శ్రీకాంత్ రెడ్డి గురు స్వామి, తుమ్మల వెంకట్ రెడ్డి గురు స్వామి, బల్వంత్ రెడ్డి స్వామి, బుచ్చి రెడ్డి గురు స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు డి రాజు, రాగం మల్లికార్జున్ యాదవ్, పి యాదగిరి, మూర్తి, అమరేందర్ రెడ్డితో కలిసి జగదీశ్వర్ గౌడ్ అయ్యప్ప స్వాములను జడ్చర్ల రాజాపూర్ లో కలిసి వారిని శాలువాతో సత్కరించి స్వాముల ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష అంటే కేవలం మాల ధారణ లేదా ఉపవాసం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర, ఒక మానసిక శుద్ధి ప్రక్రియ, ఒక భక్తి సాధన అని అన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష మనలోని చెడు అలవాట్లను, కోపం, అహంకారం, అసూయ, లోభం వంటి దుర్గుణాలను తొలగించి మనసును పవిత్రం చేస్తుందని, దీక్షలో ఉన్నవారు శాకాహారంగా, సత్యవంతంగా, సాత్వికంగా జీవిస్తారని అన్నారు. ప్రతి రోజూ పూజలు, జపాలు, భజనలు చేస్తూ ఈ యాత్ర భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు.





