శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశానికి యువతే వెన్నెముక అని, యువతకు రాజ్యాధికారాన్ని నిర్ణయించే హక్కు ఉండాలనే సంకల్పంతో రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు దేశ అభివృద్ధికి మరింత దోహదం చేయవచ్చనే దృఢ విశ్వాసంతో దేశంలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించేందుకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు.

చివరి శ్వాస వరకు దేశ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ ఎంతో శ్రమించారని జగదీశ్వర్ గౌడ్ కొనియాడారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువతకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మానేపల్లి సాంబశివరావు, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, కావూరి ప్రసాద్, మన్నె నరేందర్ ముదిరాజ్, కార్తీక్‌తో పాటు పలువురు యువతీ యువకులు, మహిళా నాయకులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





