బీసీ రిజర్వేషన్ల సాధనకు యుద్ధం

  • బీసీ ల మహాధర్నా సక్సెస్
  • రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీసీ నాయ‌కుల‌ ప్రకటన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 24 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రముఖ బిసి ఉద్యమ నేతలు శుక్రవారం ప్రకటించారు . బీసీల 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వారు ప్రకటించారు .శుక్రవారం 42 శాతం బిసి రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా లో జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఐఎఎస్ అధికారి టి చిరంజీవులు , బీసిపిఎఫ్ అధ్యక్షుడు బాలగోని బాలరాజు గౌడ్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విషారదన్ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సభకు మాజీ ఐఎఎస్ చిరంజీవులు అధ్యక్షత వహించగా తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీలు వి హనుమంతరావు, బుర్ర నర్సయ్య,మధుయాష్కి గౌడ్, మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరపత్రి అనిల్ , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం , బిపి మండల్ మనవడు సూరజ్ మండల్, మరో జాతీయ నేత హరిశ్చంద్ర మండల్, మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచందర్రావు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ రాజకీయాలలో బడుగులు ప్రవేశించకుండా ప్రజలకు రాజకీయాలను అత్యంత ఖరీదైన ప్రక్రియలుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదన కేంద్రీకృతం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు సాధించేందుకు రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని బడ్జెట్లో బీసీల వాటా ఇచ్చేందుకు ముఖ్యమంత్రిని కోరుతానని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు . సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు శత్రువులు ఎవరో స్పష్టంగా తెలుసుకొని శత్రువులపై యుద్ధం చేయాలని, బీసీలు చేసే ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా అండగా నిలుస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించాలని ఆయన సూచించారు.

మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరపత్రి అనిల్ మాట్లాడుతూ కోర్ట్ లు బీసీలకు తీర్పులు వ్యతిరేకంగా ఇవ్వడం బాధాకరమని అన్నారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ 9వ షెడ్యూల్ విషయంలో మొదటి నుంచి కట్టుబడి ఉందని ప్రకటించారు. జాతీయ బిసి నేత హరిశ్చంద్ర మండల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు బీసీలకు దక్కడం లేదని దానికి అగ్రకులాల పాలననే ముఖ్య కారణం అని అన్నారు. పోరాటాలు చేసి బీసీలు తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు . సూరజ్ మండల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు . ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తెలంగాణలో పోరాటాలు సర్వ సాధారణమని బీసీలు పోరాటాలు చేసి బీసీ సమాజాన్ని మేల్కొలిపి రిజర్వేషన్లు సాధించాలని పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ బీసీల పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సిపిఐ పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుందని చెప్పారు.

డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంటులో బీసీల కోసం కొట్లాడం లేదని విమర్శించారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తమిళనాడులో పెరియార్ ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీలు సమన్వయంతో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ మధుయాష్కి మాట్లాడుతూ ఒక నెత్తురు చుక్క రాలకుండా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీల ఆకాంక్షలు బీసీ రిజర్వేషన్లు నెరవేర్చేందుకు వ్యూహంతో కూడిన రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చేస్తామని, విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ , దుర్గయ్య గౌడ్ , బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు చామకూర రాజు , కె.వి గౌడ్ , చెన్నై శ్రీకాంత్ , వేణు , కొండల గౌడ్, ఏఐఓబిసి స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పున్నం దేవరాజ్ గౌడ్, బీసీ సంఘాల నేతలు బొమ్మ రఘురామ్ నేత, రాపోలు జ్ఞానేశ్వర్, కొండల్ గౌడ్, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here