నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు భాష అభివృద్ధి కోసం గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవ ఎనలేనిదని కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోని పూర్వా ఆచార్యులు ఎన్ ఎస్ రాజు అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ బ్లూమ్ హై స్కూల్ లో తెలుగు భాషా దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పుష్ప మాలలు వేసి నివాళి అర్పించారు. విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోని పూర్వా ఆచార్యులు ఎన్ ఎస్ రాజు విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
గిడుగు రామమూర్తి పంతులు నేటి విద్యార్థినీవిద్యార్థులకు అర్థమయ్యే వ్యావహారిక భాషలో విద్యను అందించడం కోసం నిరంతర కృషి చేశారన్నారు. అందుకు గాను బహదూర్ గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ఆశేష తెలుగు సమాజం జరుపుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం 27 శాతం మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారని అన్నారు. పిల్లలు చిన్నతనంలో తల్లి భాషలో వినడం, నేర్వడం, చదవడం, ఆకళింపు చేసుకోవడం జరుగుతుందో ఆ వ్యక్తి ఆ భాషలో సులువుగా మాట్లాడగలుగుతారని అన్నారు. మన మాతృభాష అయిన తెలుగులో ప్రావీణ్యత సంపాదించగలిగితే, ఆంగ్ల భాషలో కూడా ప్రావీణ్యత సంపాదించడానికి సులువు అవుతుందని తెలిపారు. ప్రాచీన తెలుగు భాషను సంరక్షించుకోవలసిన సామాజిక బాధ్యత తెలుగు వారందరి మీద ఉందని అన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ యు. కిరణ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ సభ్యులు వి. ఫణికుమార్, కౌండిన్యశ్రీ, నండూరు వెంకటేశ్వరరాజు, విష్ణుప్రసాద్, శివరామకృష్ణ, పాలం శ్రీను, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.