శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): తక్కువ ఫీజులతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సరస్వతీ విద్యా మందిర్‌లో మరోసారి 100% ఉత్తీర్ణతను సాధించామని పాఠశాల ప్రతినిధులు తెలిపారు. అతి తక్కువ ఫీజులతో నిరుపేద విద్యార్థులకు సైతం ఉన్నతమైన విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సరస్వతీ విద్యా మందిర్ మరోసారి అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. ఈ విద్యా సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో పాఠశాలలోని విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారని, తమ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, వారిలో అపారమైన ప్రతిభ దాగి ఉందని, తమ ఉపాధ్యాయుల నిరంతర కృషి, విద్యార్థుల పట్టుదల ఈ అద్భుతమైన ఫలితానికి కారణమని అన్నారు.
తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించాలనే తమ సంకల్పానికి ఈ ఫలితాలు మరింత బలాన్నిస్తాయని అన్నారు. ఈ విజయంలో ప్రత్యేకంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. 547 మార్కులు సాధించి ప్రత్యూష అనే విద్యార్థిని పాఠశాలలో మొదటి స్థానంలో నిలవగా, 506 మార్కులు సాధించి అలేఖ్య ద్వితీయ స్థానంలో నిలిచింది. పాఠశాల యాజమాన్యం ఉత్తీర్ణులైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించింది. భవిష్యత్తులో కూడా తమ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించింది.