మరణం లేని మహావీరుడు సుభాష్ చంద్రబోస్ – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారత స్వాతంత్ర్య సమర వీరులలో అగ్రగణ్యుడు, పుట్టుకే గాని మరణం లేని మహావీరుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో, తన అసమాన త్యాగాలతో భావితరాలకు ఎల్లప్పటికీ ప్రేరణగా నిలిచిన మహోన్నతుడు సుభాష్ చంద్రబోస్ అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ బీజేవైఎం ఆధ్వర్యంలో సుభాష్ చంద్ర బోస్ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జన్మదినం పరాక్రమ్ దివస్‌ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి రవికుమార్ యాదవ్, బిజెవైఎం, బిజెపి నాయకులు పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని,1923లో అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై యువతను ఉత్సాహపరిచారని అన్నారు. గాంధీజీ, మరికొంతమంది నాయకులు అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే ఆయనతో విభేదించి, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో 11 సార్లు జైలుకు వెళ్లిన పట్టు వదలని మహా నాయకుడు, రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బ తీయడానికి ఇదే సువర్ణవకాశమని భావించారన్నారు. యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో అజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేశారని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చెమటలు పట్టించిందని అన్నారు. భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నేతాజీకే చెందుతుందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18 న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కనుమరుగై పోయారని అన్నారు‌. యువత నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం, మంచి పాలన కోసం పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, బిజెవైఎం ప్రెసిడెంట్ ఆనంద్, శ్రీధర్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం కురుమ, జితేందర్, నవీన్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఆకుల నరసయ్య, చక్రి తదితరులు పాల్గొన్నారు.

సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల‌ వేసి నివాళి అర్పిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here