సగరులను బిసి ‘ఎ’ లోకి మార్చాలి: ఉప్పరి శేఖర్ సగర

  • సగరుల జీవన స్థితిగతులను బీసీ కమిషన్ ముందు వివరించిన రాష్ట్ర సగర సంఘం

హైదరాబాద్, నవంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి) : తెలంగాణలో సగరుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే బి.సి ‘డి’ నుంచి ‘ఎ’ లోకి మార్చడం తప్ప మరో మార్గం లేదని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో తెలంగాణ బిసి కమిషన్ ముందు సగర సంఘం వాదనలను వినిపించారు. కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి లతో కలిసి రాష్ట్ర సంఘం నాయకులు సగరుల జీవన స్థితిగతులను స్పష్టంగా వివరించారు. 1986వ సంవత్సరంలో మురళీధర్ రావు కమిషన్ నివేదిక ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు చొరవ తీసుకొని సగరులను బీసీ ‘ఎ’ లోకి మారుస్తూ 166 జీవోను విడుదల చేశారని, అనంతరం కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా జీవోను నిలుపుదల చేస్తూ బిసి ఎ లో రిజర్వేషన్ సంఖ్య పెంచి తిరిగి సదరు జీవోను అమలు చేయాలని కోర్టు ఆదేశించడం జరిగిందని వివరించారు.

బీసీ క‌మిష‌న్‌కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న ఉప్ప‌రి శేఖ‌ర్ స‌గ‌ర‌

అనంతరం కొనసాగిన ప్రభుత్వాలు సగరులను తిరిగి బిసి-డి లోనే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనాదిగా ఆర్థికంగా వెనుకబాటుకు లోనైన సగర కులాన్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుకు లోను కావడంతో విద్యా, ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ ఫలాలు, విద్యా, ఉద్యోగాలలో బీసీ ‘డీ’లో ఉండడం కారణంగా ఎలాంటి అవకాశాలు రావడం లేదని తెలిపారు. జీవో 166 ను పునరుద్ధరించడం లేదా సగరులను బీసీ ఏలోకి మారుస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. కులవృత్తిపైనే 90 శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్న సగరులకు ఫెడరేషన్ కాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సదరు కార్పొరేషన్ కు సగరులనే పాలకమండలిగా నియమించాలని సూచించారు.

బీసీ క‌మిష‌న్ స‌భ్యుల‌తో చ‌ర్చిస్తున్న స‌గ‌ర సంఘం నాయ‌కులు

నిర్మాణరంగ కార్మికులుగా ఉన్న సగరులకు గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో 59 ని సవరణ చేస్తూ ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ సంఖ్య పెంచుతూ మరో జీవోను విడుదల చేయాలని, 50 సంవత్సరాల పైబడిన నిర్మాణరంగ కార్మికులైన సగరులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సగరుల ఆది గురువైన శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రతిష్టించాలని, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుకు లోనైన సగరులను గుర్తించి నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి చైర్మన్ గా సగరున్నే నియమించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడల ఆంజనేయులు సగర, రాష్ట్ర యువజన సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శేఖర్ సగర, నల్గొండ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సగర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here