వీధి రౌడీలా వ్య‌వ‌హ‌రిస్తున్న గాంధీ వెంట‌నే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి: ర‌వి కుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజా సమస్యలను గాలికి వదిలి, వీధి రౌడీలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ వెంటనే రాజీనామా చేసి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆయన వైఖరిని ప్రజలకు తెలియపరచాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ అన్నారు. శుక్ర‌వారం కొండాపూర్ మసీదు బండ పార్టీ కార్యాలయంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేఆరెక‌పూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న హైడ్రామా మీద రవికుమార్ యాదవ్ విలేకరుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్టలు అని దుయ్యబట్టారు.

గాంధీ అని పేరు పెట్టుకుని ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని తుంగలో తొక్కుతూ అధికారమే పరమావధిగా, అభివృద్ధి అనే సాకుతూ పలుమార్లు పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేగా పేరుగాంచారని, మీరు కాంగ్రెస్ పార్టీలోకి మారారని ప్రజలందరికీ తెలుసని, ప్రతిపక్ష హోదాలో ఉన్న వారికి కల్పించే ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవి మీలాంటి నిబద్ధత లేని, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని తుంగలోకి తొక్కే వారికి కాంగ్రెస్ పార్టీ కేటాయించడం దారుణ‌మ‌ని అన్నారు. దానిని సమర్దించేందుకు అధికార పార్టీ పడుతున్న పాట్లు ఎంతవరకు సమంజసం అని ప్ర‌శ్నించారు. ప్రశాంతంగా ఉన్న శేరిలింగంపల్లిలో చేసిన తప్పును తప్పుదోవ పట్టించేందుకు ఒక రౌడీలా , గూండాగిరి చేస్తూ ప్రజాప్రతినిధి ఇళ్లపై దాడికి దిగి, అసభ్య పదజాలంతో దుషణలకు దిగి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇష్టా రాజ్యాంగా వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

గత పదేళ్ల పాలనలో కేసీఆర్ తమ మనుగడకు ముప్పు పొంచినప్పుడల్లా ఒక సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరో సమస్యను తెరపైకి తీసుకురావడం, ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్, బీఆర్ఎస్ అడుగుజాడల్లో నడుస్తూ డ్రామాలు కొనసాగిస్తుండ‌డాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. కేవలం అధికారమే లక్ష్యంగా రాజకీయ ప్రతీకారమే ఆలోచనగా ఫక్తు రాజకీయాలను నడుపుతూ తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నార‌ని, నాడు కేసీఆర్ పాలనలో అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చే చర్యలకు దిగింద‌ని, అయితే, అసలు అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైంద‌ని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే హైడ్రా పేరుతో కూల్చివేతల కార్యక్రమం పేరిట‌ హైడ్రామా చేస్తోంద‌న్నారు.

త‌మది ప్రజా పాలన అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల ఊసెత్తద‌ని, గ్యారెంటీలను గ్యారెంటీగా ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పద‌ని అన్నారు. ప్ర‌తిసారీ పరిస్థితులకు సంబంధం లేని, సమస్యలకు ముడిపడని విషయాలను తీసుకొచ్చి నానాయాగీ చేయడం, విజయవంతంగా దానిని పక్కదారి పట్టించి జవాబు చెప్పకుండా బయటపడి ఊపిరి పీల్చుకోవడం.. ఇదే కాంగ్రెస్ తంతు అని అన్నారు. తరచూ ఒక కొత్త నాటకానికి తెరలేపి, జనాన్ని మెప్పించాలని విఫలయత్నం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడ అని, ప్రజా సమస్యలు పరిష్కరించలేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీల‌ను అమలు చేయలేక, పార్టీ హైడ్రా, ఫిరాయింపుల రభస సృష్టించి పాలనా వైఫల్యాల‌ను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంద‌న్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ర‌వికుమార్ యాద‌వ్

తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయలేక రోజుకో కొత్త రాజకీయ నాటకానికి తెరదీస్తూ, హైడ్రా పేరుతో కొంతమంది పెద్దలు, ప్రత్యర్థి నాయకుల నిర్మాణాలు కూల్చుతూ, విపరీత ధోరణిలో ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమవుతూ, ప్రజలను మభ్యపెట్టడమే తమ‌ పంథాగా కొనసాగిస్తున్నార‌ని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేయలేద‌ని, ఆంక్షల పేరుతో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టార‌ని ఆరోపించారు. రైతు భరోసా అమలు చేయలేదు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారు. పైగా రైతుల నుంచి వ్యతిరేకత రాగానే హైడ్రామా మొదలుపెట్టారని, 6 గ్యారంటీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రోజుకో కొత్త డ్రామా, రోజుకో కొత్త వేషాన్ని తెరపైకి తీసుకురావడం కాంగ్రెస్-బీఆర్ఎస్ బంధాన్ని మరోసారి నిరూపిస్తోంద‌న్నారు.

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజాభ్యుదయానికి ఉపయోగించకుండా రాజకీయ స్వప్రయోజనాలకు, వేధింపులకు, సాధింపులకు ఉపయోగించాలని చూస్తే ప్రజలు క్షమించరు. ప్రజల ఓట్లతో గెలిచి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు హద్దులు దాటి, కుసంస్కారంగా విమర్శలు చేసుకోవడం సమాజానికి అవమానం, ఇటువంటి వారిని ఎన్నుకున్నందుకు ప్రజలు అసహ్యించుకుంటున్నారు, రాజకీయాల్లో ప్రతిసారి నాటకాలకు ఓట్లు పడుతాయనుకోవడం, ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమే. అటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం అని అన్నారు.

అధికార పార్టీ ప్రజాసమస్యలను సామరస్యంగా పరిష్కరించడంపై, అభివృద్ధి పథకాలపై దృష్టి పెట్టి ప్రజల మెప్పు పొందాల‌ని, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజామద్దతుతో పోరాడాల‌ని, సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల‌ని, అంతేకానీ ఇటువంటి సంస్కృతి సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు నాగులు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు , కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, అరుణ్ కుమార్, వేణుగోపాల్ యాదవ్, కేశవ్, నరసింహ చారి, ఆంజనేయులు సాగర్, కె.పద్మ, వరలక్ష్మి, రేణుక, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సురేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here