శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనగూడ డివిజన్ గంగారం గ్రామంలో భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఓబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డితో పాటు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన నాయకుడని, భారతదేశపు గొప్ప కుమారుడని కొనియాడారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు నడిపించాయని అన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందేందుకు రాజీవ్ గాంధీ విధానాలు బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం కేవలం 40 ఏళ్ల వయసులోనే దేశంలో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజీవ్ గాంధీ దేశాన్ని సమర్థవంతంగా నడిపించారని గుర్తు చేశారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు నేటి యువతకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు స్ఫూర్తినిస్తున్నాయని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించడం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, టెలికాం-ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టడం, పలు శాంతి ఒప్పందాలను కుదర్చడం వంటి చర్యలతో రాజీవ్ గాంధీ దేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడంలో, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల సామర్థ్యాన్ని భారత్‌కు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రతి భారతీయుడు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకోవాలని జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు.





