నమస్తే శేరిలింగంపల్లి: మహాత్మ జోతి రావు పూలే 131వ వర్థంతి ని మియాపూర్ స్టాలిన్ నగర్ లో బహుజన లెప్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో మైడంశెట్టి రమేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి తుకారాం నాయక్, బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ జనాభాలో బీసీల సంఖ్య ఎక్కువ ఉండటంతో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమన్యాయం జరగకపోవడం విచారకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ సామాజిక వర్గాలకు జన గణన చేపట్టాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరపున డిమాండ్ చేశారు. దేశ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీ సామాజిక వర్గానికి సమన్యాయం జరిగేలా భారత పార్లమెంటులో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు జన గణన అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 19న హైదరాబాద్ నగరంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక సంఘాలతో ముందుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనతో బీసీ జన గణన సాధించే వరకు పోరాడుతామని అన్నారు. ఏఐసీటీయూ అధ్యక్షుడు అనిల్ కుమార్, ఏఐఎఫ్ డీ డబ్ల్యు ప్రధాన కార్యదర్శి కుంభం సుఖన్య, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పుష్ప, పి భాగ్యమ్మ జ్యోతిరావు పూలే సామాజిక ఉద్యమం స్మరిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డి.నరసింహ, నరిశెట్టి గణేష్, మాధవ రావు, నర్సింగ్, రాములు, సుల్తానా బేగం, పుష్పలత, ఎం రాణి, డి లక్ష్మి, శివాని, రజియా, అమీనా, తదితరులు పాల్గొన్నారు.