నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను కమిటీ సభ్యులు సోమవారం పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న హైటెక్స్ లో పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, వారి వాహనాల కోసం ఏర్పాటు చేయనున్న పార్కింగ్ స్థలాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్లీనరీ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కమిటీ సభ్యులు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు, టి.ఎస్.ఐ.ఐ.సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఉన్నారు.