శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ 21 కార్యాలయంలో టౌన్ వెండింగ్ సమీక్షా సమావేశాన్ని టౌన్ వెండింగ్ చైర్మన్, ఉప కమిషనర్ పి.మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక విభాగం, హెల్త్, పారిశుద్ధ్య అధికారి, ప్రాజెక్ట్ ఆఫీసర్, ట్రాఫిక్ అధికారులు, కెనరా బ్యాంక్ మేనేజర్, వీధి వ్యాపారుల అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ వీధి వ్యాపారులను ఉద్దేశించి యూజర్ చార్జెస్, వాలంటీర్ల గురించి, వారి పాత్ర, ప్రాముఖ్యత గురించి తెలిపారు. చందానగర్ సర్కిల్ పరిధిలో 23 వెండింగ్ జోన్స్ ను అధికారికంగా ప్రకటిస్తున్నామని, ఇందులో రెడ్ జోన్ 12, ఆంబర్ జోన్ 10, గ్రీన్ జోన్ 1 గా గుర్తించాం అని తెలిపారు.
ఏఎంవోహెచ్ డాక్టర్ కె.ఎస్.రవి మాట్లాడుతూ వీధి వ్యాపారులను ఉద్దేశించి పరిసరాల పరిశుభ్రత గురించి, బిన్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారాంతపు సంతలలో ప్రజల కోసం బీవోటీ టాయిలెట్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. వీధి వ్యాపారులు జీవన ప్రమాణాలను, వ్యాపారం నిమిత్తం తీసుకోవాల్సిన పీఎం స్వనిధి లోన్స్ గురించి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, కెనరా బ్యాంక్ మేనేజర్ ఎస్.విజయ్ కుమార్ వ్యాపారులకు వివరించారు. వీధి వ్యాపారుల వల్ల ట్రాఫిక్‌తో ఎదురవుతున్న వివిధ సమస్యలను అధిగమించే దిశగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే నంబర్ 100, 101కి సంబంధించి హెచ్ఎండీఏ స్థలంలో 14 మంది వీధి వ్యాపారులను ఖాళీ చేయించి వారిని చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌లోని వ్యాపార స్థలానికి తరలించాలని ఉప కమిషనర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగిరెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగిరెడ్డి, ఏఎంవోహెచ్ డాక్టర్ కెస్ రవి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, ట్రాఫిక్ ఎస్ఐ నవీన్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రాములు, వెండింగ్ జోన్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.