శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కు అయిన రిజర్వేషన్ల సాధన పై చేస్తున్న ఉద్యమాన్ని అక్రమ అరెస్టులతో ఆపలేరని ఎంతటి వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న బీసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్రమ అరెస్టులపై బేరి రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బిసి లకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చట్టం చేస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వాలు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న బీసీ నాయకులను కేంద్రంలోని అధికార బిజెపి ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ రిజర్వేషన్ సాధించేవరకు పోరాటాలు కొనసాగిస్తామని ఎవరైనా అడ్డుపడాలని చూస్తే బీసీల ఓట్లతో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్లపై ప్రధాని మోదీ స్పందించాలని, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ చట్టం అమలయ్యేలా చూడాలన్నారు. ఆయన వెంట సిపిఎం శేరిలింగంపల్లి సభ్యుడు కొంగరి కృష్ణ ముదిరాజ్ ఉన్నారు.





