శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న వారికి కనీస వేతనం రూ.19వేలు ఇచ్చేలా చట్టం అమలు చేయాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం (TPUSS) రాష్ట్ర అధ్యక్షుడు మునుకుంట్ల రాజేష్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరు ఉద్యోగులు, కార్మికుల ఖర్చులు దాదాపుగా ఒక్కలాగే ఉంటాయన్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు సగటున రూ.16,452 ఖర్చు అవుతుందని పీఆర్‌సీ కమిటీ నివేదికలో చెప్పిందని, అలాంటప్పుడు ప్రైవేట్ రంగంలో, పరిశ్రమల్లో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న లక్షలాది మంది కార్మికులకు కూడా ఇదే విధంగా ఖర్చులు ఉంటాయని అన్నారు. కనుక వారికి కూడా కనీస వేతనాలను అమలయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందరికీ కనీస వేతనం రూ.19వేలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.