నమస్తే శేరిలింగంపల్లి: భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య) (ఎంసీపీఐయూ) పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాలు ఏప్రిల్ 20 నుంచి 23 వరకు హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లో నిర్వహించనున్నట్లు ఎంసీపీఐయూ కేంద్ర కమిటీ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి తెలిపారు.ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, అధిక ధరలు, మతోన్మాదం, రాష్ట్రాల అధికారాలను హరించే కేంద్ర ప్రభుత్వం నియంతృత్వం, జనగణనలో బిసి జనగణన పై చర్చించనున్నట్లు తెలిపారు. చట్ట సభల్లో మహిళా, బీసీ రిజర్వేషన్, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు , బూర్జువా, భూస్వామ్య, పెట్టుబడి దారీ పాలక వర్గ పార్టీల కు వ్యతిరేకంగా – కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్య సంఘటన నిర్మాణం పై, ప్రజా పోరాటాల విస్తృతి కోసం సమావేశం లో దీర్ఘంగా చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయుటకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, కుంభం సుకన్య, వనం సుధాకర్, పెద్దారపు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున పాల్గొన్నారు.