నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని నెక్టార్ గార్డెన్ ఎదురుగా దుర్గం చెరువు సమీపంలో అక్రమంగా భారీ షెడ్ నిర్మాణం చేపడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోవడం దారుణమని శేరిలింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్రమ షెడ్ నిర్మాణంపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఏఎంసీ మల్లారెడ్డి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మిద్దెల మల్లారెడ్డి మాట్లాడుతూ దుర్గం చెరువు సమీపంలో 600 గజాల స్థలంలో ఐదు నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భారీ షెడ్ నిర్మాణం చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులకు కనబడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన వారే నిర్మాణదారులకు వత్తాసు పలుకుతూ జీహెచ్ఎంసీ అదాయానికి గండికొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్ పాల్గొన్నారు.
