రూ.కోట్ల ప్ర‌జాధ‌నం వృధా… మియాపూర్‌లో ఖాలీగా ప‌డి ఉన్న‌ ఫుట్‌పాత్ టాయిలేట్లు…

  • వెంట‌నే వాడుక‌లోకి తేవాల‌ని ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లె ముర‌ళి డిమాండ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: వృధాగా పడేసిన ఫుట్ పాత్ టాయిలెట్‌లను వాడుకలోకి తెచ్చి ప్రజాధ‌నం వృదా కాకుండా చూడాల‌ని ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లె ముర‌ళీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన గ్రేట‌ర్‌ ఎన్నికల ముందు ఒక‌ ప్రతిష్టాత్మక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింద‌ని, న‌గ‌రంలోని ప్రయాణికులకు, రోడ్డున వెళ్లే పాదచారులకు, ముఖ్యంగా మహిళల సౌక‌ర్యార్ధం పట్టణ ప్రగతి పేరుతో 10 వేల‌ టాయిలెట్‌ల‌ నిర్మాణం చేప‌ట్టింద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో టెండర్లు వేసి కొన్ని సంస్థలకు బాధ్యతలు అప్పగించింద‌ని అన్నరు. అందులో భాగంగా శేరిలింగంప‌ల్లిలో 905 ఫుట్ పాత్ టాయిలెట్లను మంజూరు చేసిందని తెలిపారు. ఒక్క ఫుట్ పాత్ బాక్స్‌కు రూ. 5లక్షలు ఖర్చు అయినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయ‌ని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో హడావుడిగా నామమాత్రంగా కొన్ని రోడ్లపై పెట్టి కనీసం మెయింటినెన్స్ కూడా చేయకుండా వాటిని వృధాగా వదిలేశార‌ని, ఈ క్ర‌మంలోనే మియాపూర్ ప్రశాంత్ నగర్‌లో సుమారు 100 ఫుట్‌పాత్ టాయిలెట్‌ బాక్సులను ప‌డేశార‌ని తెలిపారు. ఈ టాయిలెట్ బాక్సులు నిర్మానుష్య ప్రాంతంలో ఉండడంవల్ల ఆకతాయిలు ఆ బాక్సులలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప‌డుతున్నారని, అంతేకాకుండా వర్షానికి త‌డిసి తృప్తు ప‌ట్టి పూర్తిగా ధ్వంసమై పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ టాయిలెట్‌ బాక్సులను వెనువెంటనే నిర్ణీత ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని అన్నారు.

మియాపూర్ ప్ర‌శాంత్‌న‌గ‌ర్ కాల‌నీలో వృధాగా ప‌డి ఉన్న ఫుట్‌పాత్ టాయిలెట్లు, తృప్పుప‌ట్టి పాడ‌యిపోతున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here