నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానాలో శనివారం కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ డోసు పంపిణీ కొనసాగుతుందని సూపరింటెండెంట్ వరదాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులని, కోవాక్జిన్ ఒకటవ డోసు తీసుకొని 28వ రోజుల గడువు ముగిసిన వారికి మాత్రమే రెండవ డోసు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందుకోసం కోవిన్ యాప్‌లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, మొదటి డోసు తీసుకుని గడువు ముగిసిన వారు నేరుగా హాస్పిటల్‌కు రావచ్చునని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వరదాచారి తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెంది, కోవాక్జిన్ రెండవ డోసుకు అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మొదటి డోసు కోసం లేదా కోవీషీల్డ్ వ్యాక్సిన్ కోసం హాస్పిటల్‌కు వచ్చి ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దని వారు సూచించారు.