శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ లో హై టెన్షన్ వైర్ల కింద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. సదరు స్థలం ప్రభుత్వ భూమి అని తెలుస్తుందని, ఇంత భారీ ఎత్తున ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అక్రమ నిర్మాణదారుడిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం అటువైపు తొంగిచూడడం లేదని అన్నారు. హై టెన్షన్ వైర్ల కింద భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారని, ఈ నిర్మాణానికి పని కోసం అమాయక కూలీలు తెలియక వస్తున్నారని, ఈ హై టెన్షన్ వైర్లకు చాలా ఎలక్ట్రికల్ పవర్ ఉంటుందని, దాదాపు 7, 8 మీటర్ల దూరం నుండి వాటి ప్రభావం చూపుతుంటాయని అన్నారు. అలాంటి వైర్ల కిందనే నిర్మాణం చేపడుతున్నారని, ఆ నిర్మాణానికి పైన ఉన్న హై టెన్షన్ వైర్లకు దూరం చాలా తక్కువగా ఉందని, అసలు హై టెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, నిర్మాణదారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అధికారులను, ఫిర్యాదుదారులను మభ్యపెట్టి భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపడుతున్నారని అన్నారు. కనుక అధికారులు పరిశీలించి వెంటనే ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించి, ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాన్ని పసిగట్టి ఆపాలని అన్నారు.






