మియాపూర్, రాయదుర్గంలో హైడ్రా కూల్చివేత‌లు

  • ప్రభుత్వ స్థలాలను కాపాడిన హైడ్రాకు ప్రజల అభినందనలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాల‌పై హైడ్రా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్, రాయదుర్గం దర్గా షావలిలో కబ్జాలకు గురవుతున్న రెండు విలువైన స్థలాలను హైడ్రా అధికారులు కాపాడారు. దర్గా షావలిలో కోట్లాది రూపాయల విలువైన స్థలం కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఉదయం దర్గా షావలి సర్వే నంబర్ 15 ఓల్డ్ సర్వే నంబర్ (28)లోని ఎకరం స్థలంలోని కబ్జాలను తొలగించారు. అలాగే ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రాను స్థానికులు అభినందించారు.

అలాగే అమీన్ పూర్ సర్వే నంబర్ 337, 338లుగా పేర్కొంటూ మియాపూర్ సర్వే నంబర్ 101లోని భూమిలో నిర్మాణాలు సాగించారని హెచ్ ఎండీఏ అధికారులు కూడా సదరు నిర్మాణ దారుడికి నోటీసులు ఇచ్చారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా సర్వే అధికారులు జాయింట్ సర్వే చేసి ఆ భూమి మియాపూర్ సర్వే నంబర్ 101లోకి వస్తుందని నిర్థారించారు. హెచ్ ఎండీఏ అధికారుల ఫిర్యాదుతో నిర్మాణదారులపై అమీన్ పూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అటు అమీన్ పూర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు గతంలో జారీ చేసిన పర్మిషన్ సైతం క్యాన్సల్ చేశారు. అది పక్కా ప్రభుత్వ స్థలం అని తేలడంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది శనివారం ఉదయం మియాపూర్ సర్వే నంబర్ 101లో నిర్మాణం జరిగిన భవనాన్ని కూల్చివేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here