నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్పా నగర ప్రజలు తాగేందుకు కనీసం మంచినీటిని సరఫరా చేయలేని దుస్థితిలో ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ వడ్డెర బస్తీలో కలుషిత నీటిని తాగి ఒకరు మృతి చెందడంతో పాటు 60 మందికి పైగా అస్వస్థతకు గురైన సంఘటనను నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ లోని జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా చేసి ముట్టడించారు. ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ కలుషిత నీటిని తాగి బీమయ్య అనే వ్యక్తి మృతిచెందడం బాధాకరమని అన్నారు. మరో 60 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యూజీడీ పనుల కోసం రూ. 400కోట్లు కేటాయించామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పాలకులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలపాలని అన్నారు.
నియోజకవర్గంలోని హాఫిజ్ పెట్, కొత్తగూడ, హైటెక్ సిటీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతూనే ఉంటుందని చెప్పారు. కలుషిత నీటి సరఫరాకు ప్రభుత్వం బాధ్యత వహించి మృతిచెందిన భీమయ్య కుటుంబానికి రూ. 25 లక్షలు, అస్వస్థతకు గురైన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఈ మేరకు హఫీజ్ పెట్ జలమండలి అధికారి రాజశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కొండాపూర్ లోని ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిచారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞ్యానేంద్ర ప్రసాద్ , రవికుమార్ యాదవ్ , యోగానంద్ , బుచ్చిరెడ్డి , ప్రసాద్ , అనిల్ గౌడ్ , రాధా కృష్ణ యాదవ్ , కాంచన కృష్ణ ,శ్రీధర్ రావు , ఆంజనేయులు , రాజు శెట్టి , హరికృష్ణ , కుమ్మరి జితేందర్ , శ్రీశైలం , మహిళా నాయకులు విజయలక్ష్మి, వినీత సింగ్, హరిప్రియ, బీజేవైఎం నాయకులు ఆనంద్, సతీష్ గౌడ్, శివయాదవ్, సందీప్, మంజు తదితరులు పాల్గొన్నారు .