నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు విస్తరణ పేరుతో బడా నిర్మాణ సంస్థలకు అధికారులు తొత్తులుగా మారి పేదలను బెదిరింపులకు గురిచేస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా వాసులు వాపోయారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన భూ నిర్వాసితులు గోపన్ పల్లి తండాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ బడా నిర్మాణ సంస్థ కోసం రోడ్డు విస్తరణ చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పేదల ఇళ్లను పోలీసులను మోహరించి నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం సరికాదన్నారు. కనీసం ఇంట్లోని సామాన్లను సర్దుకునేంత సమయం ఇవ్వకుండా ఆగమేఘాల మీద కూల్చివేయడంతో కట్టు బట్టలతో పిల్లాపాపలతో రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి తమ తాతలు, తండ్రుల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న తమను ఓ బడా నిర్మాణ సంస్థ లబ్ది కోసం పక్కా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో పోలీసులను పెట్టి దొంగలు దోచుకున్నట్లు ఇళ్లను, భవనాలను కూల్చివేశారని మండిపడ్డారు. కూల్చి వేసిన వాటికి నేటికి నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని పేదల గూడును తొలగించిన కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పేదల ఉసురు తప్పకుండా ముడుతుందని శాపనార్థాలు పెట్టారు. తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఇళ్లను దృష్టిలో పెట్టుకుని యూజీడీ నిర్మాణం చేపట్టాలని, రోడ్డు ఎత్తు పెంచకుండా చూడాలన్నారు. తమకు అన్యాయం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమావేశం లో గోపన్ పల్లి తండా వాసులు రాజు నాయక్, సురేష్ సింగ్, ప్రకాష్, పొన్నయ్య, కుమార్, ఎల్లమ్మ తదితరులు ఉన్నారు.