హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలతో కూడిన గెజిట్‌ను శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4వ తేదీన వెలువడగా ప్రస్తుతం ఉన్న పాలకవర్గం పదవీ కాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో మేయర్ ఎన్నిక తేదీను కూడా ప్రకటించనున్నారు. త్వరలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
కాగా జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా తెరాసకు 56 స్థానాలు, బీజేపీకి 48, మజ్లిస్‌కు 44, కాంగ్రెస్‌కు 2 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో తెరాసకు ఉన్న 56 మంది కార్పొరేటర్లకు తోడు మరో 35 మంది ఎక్స్ అఫిషియోల ఓట్లు తోడైతే బలం 91కి చేరుకుంటుంది. అదే బీజేపీకి అయితే 48 మంది కార్పొరేటర్లకు తోడు ఎక్స్ అఫిషియోలతో కలిపి 50 మంది బలం ఉంది. కాగా ఇటీవలే లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ రమేష్ గౌడ్ మృతి చెందారు.