శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్, రాయదుర్గం, మంజీర డైమండ్ హిట్స్, నల్లగండ్ల హుడా కాలనీ, నానక్ రామ్ గూడలలో సీసీ రోడ్లు దెబ్బ తినడం వల్ల చిన్న పాటి వర్షానికి గుంతలలో నీరు నిలిచి స్థానిక ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తక్షణమే నూతన రోడ్లు వేయించాలని కోరారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జనాభా దృష్ట్యా రోడ్డు వెడల్పు కూడా చేయవలసిన అవసరం ఉందని కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ని కోరారు. గచ్చిబౌలి డివిజన్ విస్తారమైన ప్రాంతం కాబట్టి, ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారని, స్థానికుల మౌలిక వసతుల కోసం తగిన నిధులు మంజూరు చేయవలసిందిగా కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ను కోరారు. దీనికి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డితో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అలోక్, అతుల్, మోహిత్, రాకేష్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.