నమస్తే శేరిలింగంపల్లి: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని ఎంసీపీఐయూ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లె మురళి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్ హెచ్చరించారు. శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గత 13 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు చేస్తున్న దీక్షకు ఎంసీపీఐయూ రాష్ట్ర నాయకులు పల్లె మురళి, బీఎల్ఎఫ్ నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, అంగడి పుష్ప, గూడ లావణ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు ఉసేత్తకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ అమూల్యమైన సమయాన్ని ఉద్యమం కోసం త్యాగం చేసి స్వరాష్ట్ర ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎమ్మెల్యే, ఎంపీలకు లక్షలాది రూపాయల వేతనాలు పెంచి, కష్టపడిపనిచేస్తున్న వీఆర్ఏలకు వేతనాలు పెంచకపోవడం దారుణమని వాపోయారు. వారి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు నిరాహారదీక్షలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. అర్హతగల వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని, వీఆర్ఏల ప్రెస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని, 55 ఏండ్ల వయస్సు నిండిన వారి స్థానంలో వారసులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించకుంటే ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, పుష్ప గూడ లావణ్య, వీఆర్ఏ కృష్ణ, జంగయ్య, అంజన్ రాజు, శరత్, జమీర్ యాదయ్య, శ్రీకాంత్, రామకృష్ణ, బాబురావు, మహేష్, రాములు, మల్లేష్, ఆనంద్, సురేష్, లక్ష్మయ్య, ప్రసాద్, భారతమ్మ, వీఆర్ఏల బృందం పాల్గొన్నారు.