నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల నిరంకుశంగా వ్యవరిస్తూ, తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనేంత వరకు ఉద్యమం ఆగదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నను వ్యతిరేఖ వ్యవసాయ చట్టాల పేరుతో రోడ్లపై ఆందోళనల్లో కూర్చోబెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిదేమని అన్నారు. రైతులు కష్టపడి పండించిన వరి పంటను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్ధృతంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన కేంద్రం, ఇప్పుడు తెలంగాణ రైతుల పంటలను కొనబోమని, రాష్ట్రం కొనకూడదని అదేశించడం సరికాదన్నారు. ఈ నిరంకుశ అన్యాయ విధానాల్ని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాక ఢిల్లీలో కేసీఆర్ నేతృత్వంలో దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. దేశచరిత్ర లో రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.