ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొంత సేపటి క్రితమే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కరోనా వల్ల చనిపోయిన వారిని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారత్‌లో అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ అత్యంత చవకైందన్నారు.
కరోనా ఎంతో మందిని తమ కుటుంబాలకు దూరం చేసింది. ఎంతో మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. దూర దూరంగా ఉండాల్సి వచమచింది. ఎంతో మంది హాస్పిటళ్లలో ఖరీదైన వైద్యం చేయించుకోలేకపోయారు. కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. గత ఏడాదిని ఒక సారి పరిశీలిస్తే మనం చాలా నేర్చుకున్నామని మనకు అర్థం అవుతుంది. భారత దేశం మొత్తం ఒక కుటుంబంలా మెలిగాం.. అని మోదీ అన్నారు.
కరోనాపై పోరాటంలో మనం నమ్మకాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ఉండాలి. వ్యాక్సిన్ ప్రారంభం అయిందని చెప్పి నిర్లక్ష్యం పనికిరాదు. మాస్క్‌లను ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న ఎన్నో లక్షల మందిని స్వదేశానికి తీసుకొచ్చాం. చరిత్రలో ఇంతటి భారీ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. 3 కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న దేశాలు 100కు పైగా ఉన్నాయి. కానీ మనం మొదటి దశలోనే 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఇస్తున్నాం. త్వరలో ఈ సంఖ్య 30 కోట్లు అవుతుంది… అని మోదీ అన్నారు.
వ్యాక్సిన్ ముందుగా హెల్త్ కేర్ వర్కర్లకు, తరువాత రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి ఇస్తాం. దేశ వ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది.. అని మోదీ తెలిపారు.