శేరిలింగంపల్లి, నవంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో కాలనీలలో చేపట్టిన నాసిరకం సిసి రోడ్లను అలా నిర్మించడం చాలా బాధాకరం అన్నారు. నాసిరకం, నాణ్యతా ప్రమాణాలు పాటించక రోడ్లు నిర్మించడం, కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకం పనుల వలన 6 నెలలలోపే దెబ్బతినడం పట్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజాధనం దుర్వినియోగం అవుంతుందని PAC చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారికి మళ్ళీ పనులు అప్పగించకూడదని, ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వలన ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, అధికారులు తీరు మార్చుకోవాలని, మౌలిక వసతులు కల్పించే క్రమంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఇటువంటి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు SE శంకర్ నాయక్, EE GKD ప్రసాద్, DE ఆనంద్, AE సంతోష్, నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్, సందీప్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.