- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, దీని వల్ల రక్షణ లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పాపమ్మ బస్తీలో పోలీస్ శాఖ, కాలనీ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో రూ.3 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను ఎస్ఐ లింగం, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. కాలనీ అసోసియేషన్లు సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటుండడం అభినందనీయమన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. కాలనీలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు తన నిధుల నుంచి రూ.1 కోటి కేటాయించడం జరిగిందన్నారు. దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, కనుక అందరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, కాశీనాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, రాజేష్ చంద్ర, లక్ష్మీ కుమారి, మంజుల, సమ్మా రెడ్డి, బోయ కిషన్, కాలనీ వాసులు లక్ష్మి, సాంబరెడ్డి, సన్యాసి రావు, రత్నం, భిక్షపతి, కృష్ణ, నరేంద్ర, చంద్రకళ, కృష్ణ వేణి, సుజాత పాల్గొన్నారు.