శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర డ్రామాలు మానాలని సూచించారు. ప్రజలకిచ్చిన హామీలు, పరిపాలన పై దృష్టి పెడితే మంచిదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బొగ్గు కుంభకోణం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేని తమ అసమర్థతను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తున్నదన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్నారు. పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని చిర్రా రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే స్కాంలు రోజుకొటి బయట కి వస్తున్నాయన్నారు. నోటీసులతో వచ్చేది.. పోయేది ఏమి లేదని చిర్రా రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.






