నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాటి నివారణ కోసం కాలనీల వారీగా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ సుదాంష్ తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ శంకరయ్య ఆదేశాల మేరకు చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ నందగిరి ఆధ్వర్యంలో చందానగర్ సర్కిల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీ సుదాంష్ మాట్లాడుతూ భారీ వర్షాల వలన ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా నియమించబడిన అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమకు కేటాయించిన కాలనీల్లో పర్యటించి ప్రమాదకర మ్యాన్ హోల్స్, నాలాలకు సేఫ్టీ జాలీలు, అనధికార సెల్లార్ గుంతలు, శిథిల భవనాలు, లోతట్టు ప్రాంతాలు తదితర వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు అధికారుల కు సమాచారం ఇవ్వాలన్నారు. గుర్తించిన వాటిలో పనులు వెంటనే జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి చందానగర్ సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని డీసీ సుదాంష్ ఆదేశించారు. సమాచారం కోసం అధికారులు, సిబ్బంది నియమించారు. ఈ సమావేశంలో ఈఈ శ్రీకాంతి, వైద్యాధికారి కార్తీక్, ప్రాజెక్టు ఆఫీసర్ ఉషారాణి, డీఈ సురేష్, ఇంజనీర్లు, సూపరింటెండెంట్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.