శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ లో జరగనున్న ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవబోయేది బిఆర్ఎస్ పార్టీ నే అని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా షేక్ పేట్ డివిజన్ షేక్ పేట్ గ్రామంలోని వివేకానంద నగర్ కాలనీలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో తెలంగాణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యుడు సురేందర్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమాతో కలిసి సాయిబాబా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లో లేరని, వారు ఇచ్చిన 420 హామీలను ప్రశ్నిస్తూ ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ మంత్రులను సైతం ప్రశ్నిస్తూ వెనక్కి పంపిస్తున్నారని అన్నారు. కచ్చితంగా ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పి తీరుతారని, అడుగడుగునా జనాలు హారతులతో తమ అభ్యర్థికి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తప్పకుండా ఎగురబోయేది బిఆర్ఎస్ జెండానే అని అన్నారు.






