నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కావలసిన ఏర్పాట్లకు సహకరించాలని శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శంకరయ్యను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, గుడిమల్కాపూర్ డివిజన్ కార్పొరేటర్ కరుణాకర్ కోరారు. జూలై నెల ఒకటో తేదీ నుండి నాల్గో తేదీ వరకు మాదాపూర్ లోని నోవాటల్ హోటల్ లో తలపెట్టిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి అన్ని ఏర్పాట్లకు సహకరించాలని వినతిపత్రం అందజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బిజెపి పాలిత 16 రాష్ట్ర సీఎంలు, బిజెపి పార్లమెంట్ సభ్యులు, బిజెపి ఎమ్మెల్యేలు, బిజెపి ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న దృష్ట్యా హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఫుట్ పాత్ లను, రోడ్లను శుభ్రం చేసేలా, స్వచ్ భారత్ కు సంబంధించి అందమైన కళా కృతులను, పెయింటింగ్స్ ను ఏర్పాటు చేసి శోభాయమానంగా వీధి దీపాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.