నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ లో మే 19 న జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారి బిజెపి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తెలిపారు. మే నెల 19 వ తేదీన జరిగిన దాడి ఘటనపై రంగారెడ్డి అర్బన్ జిల్లా కోర్ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించిన కోర్ కమిటీ సభ్యులు ప్రత్యక్ష దాడికి పాల్పడిన రంగస్వామిని శక్తి కేంద్ర ప్రతినిధి బాధ్యతల నుంచి తొలగిస్తూ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. బిజెపికి ఎలాంటి సంబంధం లేకుండా దాడికి పాల్పడిన ముగ్గురి వ్యక్తులపై, రంగస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనపై గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని వివరణ కోరుతూ షోకాజు నోటీసులు ఇవ్వాలని కోర్ కమిటీ నిర్ణయించినట్లు సామ రంగారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జీ ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, చింతకింది గోవర్ధన్ గౌడ్, పిట్టా ఉపేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.