నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ నెల 27 న చేపట్టనున్న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం బొల్లారం పారిశ్రామిక వాడలోని శ్రీవెంకటేశ్వర కాయర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు, కార్మికులు కంపెనీ ఎదుట భారత్ బంద్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ మోడీ వినాశకర విధానాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. నైజాం పోకడలను తలపిస్తున్న కేసీఆర్ పాలనను ఎండగట్టాలన్నారు. దేశాన్ని కాపాడండి ప్రభుత్వ సంస్థలను, కార్మికులను, రైతాంగాన్ని రక్షించండి అంటూ చేపట్టనున్న భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చడంతో కార్మికుల హక్కులు హరించడమేనన్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రైవేటు పరంచేయడంతో పరిశ్రమలలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర కాయర్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు, కార్మికులు వి.బి గుప్త, సురజ్ కాంత్, కె. రాజు, పి.అంజయ్య, సరోజ్ కుమార్, రాజేశ్వర్ రామ్, తపన్, శ్రీకాంత్, ఉపాధ్యాయ, శంకర్, రాము, సోనీ, రెడ్డిప్ప తదితరులు పాల్గొన్నారు.