అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవపై అవగాహన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హెచ్‌సీయూ సెంటర్ ఫర్ ఎర్త్, ఎట్ మాస్ ఫియర్ సైన్సెస్, ఓషియన్ ఆచార్య G. కిషోర్ కుమార్ హాజ‌రై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి భూమిని కాపాడేది ఓజోన్ పొర అని అన్నారు. భూమిపై సకల జీవరాశుల ప్రాణలను కాపాడుతున్నది కూడా ఓజోన్ పొర‌నే అని, ఓజోన్ పొర అంటార్కిటికా ప్రాంతంలో దెబ్బతినడాన్ని 1975 సంవత్సరంలోనే శాస్త్రజ్ఞులు గుర్తించార‌ని తెలిపారు. అది నానాటికి పలుచనవుతూ 1987 నాటికి తీవ్రంగా దెబ్బతింద‌న్నారు. అభివృద్ధి పేరుతో మనుషులు చేసే చర్యల వలన ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు, రసాయనాలు, ప్ర‌కృతి వనరులు దుర్వినియోగం కూడా ఓజోన్ దెబ్బతినడానికి కారణాల‌ని అన్నారు. ఓజోన్‌ను రక్షించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సెప్టెంబరు 16న‌ ప్రపంచ వ్యాప్తంగా ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నార‌ని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలందరిచే ఓజోన్ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పద్మజ, వీరేశం, విద్యార్థిని, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, అమ్మయ్య చౌదరి, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here