నమస్తే శేరిలింగంపల్లి: ఫీజుల కోసం విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడం దారుణమని, అలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు ఏకాంత్ గౌడ్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఫీజు పెండింగ్ లో ఉందని విద్యార్థులను పరీక్ష హాలు నుండి బయటికి పంపించిన విషయాన్ని తల్లిదండ్రులు శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఏకాంత్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లి యాజమాన్యంతో ఏకాంత్ గౌడ్ మాట్లాడి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతిని ఇప్పించారు. ఈ సందర్భంగా ఏకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఫీజులు పెండింగ్ ఉన్నంత మాత్రాన విద్యార్థులను పరీక్షలు రాయించ కపోవడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి కార్పొరేట్ యాజమాన్యాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు.