నమస్తే శేరిలింగంపల్లి: కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దేశ ప్రజలందరికీ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా జాతి, కుల, మత ప్రాంతాలకతీతంగా ఆనందోత్సాహాలతో పండుగలా జరుపుకునే జాతీయ పర్వదినమిది అన్నారు. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ జోహార్లు అర్పించారు. ప్రజాభివృద్దే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి సంక్షేమ పథకం పేదవారికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చే ముందు పేద ప్రజలను గుర్తుకు తెచ్చుకోవాలని మహాత్మాగాంధీ చెప్పారని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల సాధికారికతకు సుగమమైందని చెప్పారు. రైతు బంధు ,రైతు బీమా , మిషన్ కాకతీయ వంటి పథకాల ద్వారా రైతుల జీవితాలలో వెలుగు నిండాయని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నాము అని , యువత మంచి స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో , గొప్ప గొప్ప లక్ష్యాలతో ముందుకువచ్చి దేశ ,రాష్ట్ర ,ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ది కోసం జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి వివరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు గాంధీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాల ను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి , శాసన సభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప , కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఎస్పీ వైవి సురేంద్ర కుమార్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శాంతారాం, జిల్లా అధికార యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.