శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ గుంతను తవ్వుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ హఫీజ్ పేట డివిజన్ పరిధిలో మంజీరా రోడ్డుకు ఆనుకుని భారత్ పెట్రోల్ పంపు పక్కన అక్రమంగా సెల్లార్ గుంతలను తవ్వుతున్నారని అన్నారు. భవన నిర్మాణం కోసం బిల్డర్ ఈ గుంతను తవ్వుతున్నారని, నగరంలో ఎలాంటి సెల్లార్ గుంతలు తవ్వకూడదని నిబంధనలు ఉన్నా, వాటిని పాటించకుండా యథేచ్ఛగా గుంతలు తవ్వుతున్నారని అన్నారు. ఈ గుంత పక్కనే 8 అంతస్తుల అపార్ట్ మెంట్ ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువగా సంభవిస్తుందని అన్నారు. రోడ్డుకు దాదాపు 20 అడుగుల సెట్ బ్యాక్ విడిచి తవ్వకం చేపట్టాలని, కానీ భవనానికి ఆనుకుని గుంతలను అక్రమంగా తవ్వుతున్నారని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సదరు బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.